Latest Posts

Content

Sunday, June 26, 2022

భోగిమంటలు

‘నందూ, భోగిమంటకి కర్రలు తెచ్చావా? ఓ రెండు పట్లైనా ఉండాలి. మర్చిపోకు. తెల్లారే నాలుక్కల్లా వేసెయ్యాలి. అప్పుడే మజా!’ అన్నాను కారు పార్క్ చేసి లోపలికొస్తూ. 

మా ఋష్యశృంగుడు సరేనన్నాడు. ఆల్రెడీ కర్రలడితీ వాళ్లతో చెప్పేసి వచ్చానన్నాడు. తీరాజేసి ఆరోజు సాయంత్రం ఏంజరిగిందీ?

‘రేపు తెల్లవారుజామున ఐదూనలభయ్యైదుకి మన అపార్ట్‌మెంట్ ముందు భోగిమంట వేయబడును. అందరూ పాల్గొని, సంబరాలు జరుపుకోవలసిందిగా ప్రార్ధన’

మా  వాట్సప్‌ గ్రూపులో ఈ మెసేజ్ చూడగానే నాకు ఒక్కసారిగా కంగారొచ్చింది. ఆనక కన్నీరొచ్చింది. హవ్వ! బారెడు పొద్దెక్కిన తరవాత భోగిమంటా? మన చిన్నతనాల్లో ఎప్పుడైనా ఎరుగుదుమా?

వెంటనే మెసేజ్ చేసేశాను. ఏమనీ?  లాభంలేదు, అయిదుకల్లా అగ్గిముట్టించాల్సిందే, నాలుగున్నరకల్లా అందరం కిందకొచ్చేద్దామంటూ! 

చలెక్కువగా ఉన్నదనీ, పిల్లలు లేవరనీ, అంచేత అంత త్వరగా వద్దనీ సమాధానం వచ్చేసింది. 

అసలు చలెక్కడుంది? గత పదేళ్లుగా చూస్తున్నాను. ‘చలి బాబో’యంటూ స్వెట్టర్ వేసుకున్న జ్ఞాపకం లేదు. ఆమధ్య హిమాచల్‌ప్రదేశ్ టూరెళ్లినపుడు మాంఛి చలికోటొకటి కొన్నాను. తను అప్పటికీ అంటూనేవుంది. నీకసలు చలే ఉండదూ, వద్దూ అని. కానీ మనాలీ వెళ్లినప్పుడు కూడా వద్దంటే నా ఆలినేమనాలి?

అయితే ఆ స్వెటర్ ఆరోజునుంచి ఆ కోటు నా హృదయంలో నిదురించే చెలీ అన్నట్టు బీరువాలో అత్యున్నత స్థానంలో రహస్యంగా పడివుంది. ఎప్పుడైనా దాన్నుంచి ఓ రెండుమూడు పిల్ల స్వెట్టర్లు పుట్టకపోతాయా అని ఆశ.

సరే, ఇదంతా మీరు కాబట్టి చదూతున్నారుగానీ మా అపార్ట్‌మెంట్ వాళ్లతో చెప్పలేను కదా? 

‘అబ్బా డాక్టర్ గారూ, ప్రతీ చిన్నవిషయాన్నీ ఓ కథలాగా చెప్తారుకదా?’ అని విసుక్కుంటారని భయం. అంచేత సంక్రాంతి గంగిరెద్దులా తలాడించేసి రాత్రి పెందరాళే బబ్బున్నాను.

సరిగ్గా నాలుగున్నరయ్యేసరికి ఫోన్ గణగణమంది. ఎప్పుడో కొమ్మూరి సాంబశివరావు నవలల్లో చదివిన జ్ఞాపకం ఈ గణగణమనడం. అసలీ రోజుల్లో గణగణమనే లాండ్‌లైన్లు ఎవరు వాడుతున్నార్ట? వేషం కాకపోతేనూ?

ఫోననగానే గణగణమనును... పాము బుసబుసమనును... పెళ్లాం రుసరుసమనును... ఇవన్నీ మురికిపట్టిన పాత వర్ణనలు. మారుద్దాం. 

సరే, మోగింది. 

పాపం.... ‘ప్రెసిడెంట్ గారు ముచ్చటపడ్డారని మంటెయ్యడానికి ఇంత పొద్దున్నే తయారైపోయారా?’ అని మావాళ్లమీద జాలిపడుతూ ఫోనందుకుని చూస్తే నర్సింగ్‌హోమ్ నుంచి రాజుగాడు.

‘చెప్పు రాజూ!’

’సార్, రెండు ఎమర్జెన్సీ కేసుల్సార్! ఒకదానికి బా... పెయిన్సొచ్చేస్తన్నాయి. ఇంకోటి పర్లేదుకానీ తనకీ వస్తన్నాయి సార్!’

‘దేవుడా! కింద భోగిమంట కోసం అంతా రెడీ చేసుకున్నాం రాజూ! ఇప్పుడే రావాలా ఈ పేషెంట్లు?’

‘తొరగా వచ్చీండి సార్. బేగెలిపోదురూ!’

సర్జన్ల కనుసన్నల్లో తిరిగే మామీద వీడి కన్సర్నేవిఁటో? 

సరే, చేసేదేంలేక బ్రష్ మీద పేస్టిలా నొక్కానో లేదో ‘ఢాం.....!’ అంటూ మా కోలనీ మొత్తం దద్దరిల్లిపోయేంత శబ్దం వచ్చింది. 

వామ్మో, ఇదేంటిదీ? పేస్టింకా ఉందే? అయిపోలేదుగా? 

తీరా బయటికొచ్చి చూస్తే అది మా ఎదురుగా ఉన్న వీధిలో కుర్రాళ్లు భోగిమంటేసి బాంబులు పేలుస్తున్న సౌండని తెలిసింది. 

మీ దుంపల్తెగా ఇప్పుడు బాంబులెక్కడివిరా మీకూ? దెబ్బకి మా కోలనీలో ఉన్న అపార్ట్‌మెంట్లన్నింట్లోనూ లైట్లు వెలిగాయి. వీధివీధంతా మొత్తం లేచికూర్చుంది. అయితే అక్కడితో ఆగలేదు వాళ్లు. హండ్రడ్ షాట్స్, హైడ్రోజన్ బాంబులు అలా వరసగా పేలుస్తూనే ఉన్నారు.

బాంబులమోతల మధ్య, పక్కనేవున్న వేంకటేశ్వర స్వామి ఆలయంనుంచి వినబడుతున్న బాజాభజంత్రీల మధ్య అత్యంత వైభవోపేతంగా దంతధావనం పూర్తిచేశాను. బ్రషింగ్‌ని ఎప్పుడూ ఇంతలా సెలబ్రేట్ చేసుకోలేదు!

సరే, తయారై కిందకొచ్చేసరికి మా వీధిలో రెండు మూడు మంటలు అప్పుడే ఎలక్ట్రిక్ తీగలదాకా లేచేశాయి. మిగతావన్నీ నా అంతెత్తు కర్రలపోగులతో ఎప్పుడెప్పుడు కాలదామా అని ఉవ్విళ్లూరుతున్నాయి. 

మావాడు కూడా ఓ పోగు సెట్ చేశాడు. మధ్యలో కర్పూరం బిళ్లలవీ పడేసి అగ్గిపెట్టట్టుకుని ఆ కట్టెల చుట్టూ పుష్పరాజ్‌లా తిరుగుతున్నాడు. 

వాళ్లావిడ సిమెంటు గచ్చునే వాకిలిగా భావించి, కళ్లాపిచల్లి ‘సామీ... నా సామీ!’ పాట పాడుకుంటూ ముగ్గేస్తోంది. 

‘ముంగిట ముగ్గులేసే అమ్మణ్ణులు ఎల్లప్పుడూ ‘ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ’ పాటే పాడాలని నీలాంటి ఛాందసులింకా ఆశిస్తారేమోగానీ దాసూ, ఈలోకం మారిందయ్యా...!

పదేళ్లక్రితం రింగరింగా పాడుతూ వేసీవారు. రెండు మూడేళ్లక్రితం జిగేల్‌రాణి పాడుతూ వేసీవారు. 

ఇవన్నీ చూసి కూడా నువ్వింకా మారనూ అంటే లోకం హర్షించదయ్యా!’ 

అంటూ జె.వి. సోమయాజులు గారి స్వరంలో నా పక్క సీట్లోంచి వినబడింది. 

ఎవరా అంటూ చూస్తే వాడు నా అంతరాత్మగాడు. అప్పుడే తలస్నానం చేసేసి, ఆరెంజ్ కలర్ పాంటు, గ్రీన్‌ కలర్ షర్టూ వేసుకుని, చెవులమీద వరకూ పౌడర్ రాసుకుని కనబడ్డాడు. 

వీడీమధ్య బాగా తరచుగా వెంటపడుతున్నాడు. నాకసలే భావుకత, మనోభావుకత రెండూ ఎక్కువగా ఉండడంవల్ల మన సంస్కృతిని, సంప్రదాయాల్ని  ఎవరైనా ఏమన్నా అంటే పిసుక్కుచావడం అలవాటైపోయింది. స్వతహాగా ఎవరితోనూ గొడవపడ్డం ఇష్టం ఉండదని ఈ అంతరాత్మగాడికి తెలుసు. అందుకే రైల్లో టీ అమ్మేవాడిలా ఇలా మాటిమాటికీ వచ్చేస్తున్నాడు.

ఇక వచ్చిన దగ్గర్నుంచి ఏవేవో చెబుతాడు. నువ్విలా మారాములవీ మానేసి మాస్టర్ రామూలా బుద్ధిగా ఉండాలంటాడు. 

‘సరేలేరా, అడ్జస్టయిపోదాం’ అంటూ సెకండ్ నించి థర్డ్ గేరుకొచ్చా. వాడు నిర్లిప్తంగా కళ్లుమూసుకుని దీర్ఘాలోచనలో పడ్డాడు. 

‘నువ్వలా నిద్రదీ పోకురోయ్! నాకూ ఊపుతుంది!’ అంటూ హెచ్చరించాను. వాడు దారిపొడుగునా భోగిమంటల్ని చూస్తూ మన సంస్కృతి, సంప్రదాయం చట్టుబండలైపోకుండా కాపాడబడుతున్నాయని ఆనందబాష్పాలతో కిటికీ అద్దాన్ని తడిపేస్తున్నాడు. అర్ధంపర్ధం లేకుండా అద్దాలవీ తడిపెయ్యొద్దని, వాడినలా మరీ ఎమోషనలవ్వొద్దని మరోసారి హెచ్చరించి స్పీడు పెంచాను.

సరిగ్గా రింగ్‌రోడ్డు టర్నింగ్ దగ్గరకొచ్చేసరికి మాకు కష్టకాలం దాపురించింది. రోడ్డుకడ్డంగా పదిమంది కుర్రాళ్లు జుట్లవీ ముడెట్టి, జట్లవీ కట్టి డాన్స్ చేస్తూ కనబడ్డారు. వాళ్ల మొహాలు చూస్తే పోయిన సంక్రాంతికి కడిగినట్టున్నాయి. నాకిక కారాపక తప్పిందికాదు.

వాళ్లు చాలా పెద్ద మంటే వేశారు. ఒకమూల నేను కూర్చున్న సీటు కిందనించి గభీ గుభీమని అదుర్తోంది. ఎందుకిలా అదుర్తోందా అని అద్దం దించానోలేదో ‘య్యా య్యా య్యా య్యా జైబాలయ్యా...!’ అంటూ ఒకపాట హైదరాబాదులో పడుకుని నిద్రపోతున్న బాలకృష్ణకి సైతం వినబడేంత సౌండులో ఎత్తిపడేస్తోంది.

మంటకి అటూయిటూ పదేసి అడుగుల ఎత్తు స్పీకర్లు పెట్టి పాటలు పెట్టారు. భోగిమంటేసి రొటీన్‌కి భిన్నంగా ‘ఎంజామెంట్’ చేస్తన్నారు. ఆ మూకలో మెరుపులూ, జిలుగుల డ్రెస్సులేసుకున్న ఆడపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ల తల్లిదండ్రులు దూరంనుంచి పిల్లల ప్రతిభాపాటవాల్ని చూస్తూ మురిసి ముక్కలైపోయి ముక్కులు చీత్తున్నారు. 

దాదాపు పదినిముషాలపాటు వాళ్లు నన్ను వెళ్లనివ్వలేదు. ఇలా దురదృష్టవశాత్తు నేనొక డాక్టర్నని, రెండు రెళ్లు నాలుగు ప్రాణాలకు నేను హామీపడ్డానని, నేనిక్కణ్ణించి బయటపడితేనే వాళ్లు బయటపడతారని బ్రతిమాలుకుని బయల్దేరాను.

నాకిదంతా కంపరంగా ఉంది. హృదయంలో వేడి భోగిమంటకన్నా పెద్దగా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. దాంతో సహనం కోల్పోయాను.

‘మీయమ్మా కడుపులు కాలా! ప్రతీదానికీ ఈ పాటలూ డాన్సులూ ఏవిఁట్రా? అది భోగిమంటలా ఉందా అసలు? ఊరు తగలడిపోతున్నట్టుంది. చీడపీడలన్నిటినీ వదిలించుకుని, చలినెదుర్కోవడానికి దగ్ధమవగల పాత వస్తువులనీ, వంటచెరకునీ, తాటికమ్మలనీ మంటపెట్టడం మన సాంప్రదాయం! కానీ ఇదేవిఁటిది? ఆ ఫూల్‌బాగ్ బంగార్రాజుకి ఎంత సొంత బస్సులుంటే మాత్రం పాత బస్సు టైర్లు తీసుకొచ్చి మంటల్లో పడేస్తాడా? ఆ నల్లటి పొగ చూడు?’ అంటూ ఆవేశంతో డ్రైవ్ చేస్తున్నాను.

వాడు ఒక్కలిప్త గొంతు సవరించుకుని మొదలెట్టాడు...

‘చూడొరేయ్, ఈ పండగనేది బేసిగ్గా పదిమందీ సంతోషంగా జరుపుకునేది. భోగవనీ, దసరా అవనీ! వాళ్లకి ఏది ఆనందాన్నిస్తుందో అదే ఏడుస్తారు.‌ మధ్యలో నీకేవిఁట్టా నొప్పీ?’

‘అలానికాదురా, ఆ వినాయకచవితికీ అంతే! ఆయనెంత మంచి దేవుడైతేమాత్రం అంత చనువు తీసేసుకోవచ్చునా? రేషన్ బియ్యం కొలిచే వినాయకుడు, అన్న క్యాంటీన్లో అన్నం పెడుతున్న వినాయకుడూ అంటూ రకరకాల వేషాలేసేస్తున్నారు. ఆ అష్టోత్తర శతనామాల్లో ఈ వేషాలకి తగిన పేర్లు కూడా చేర్చేస్తారు కొన్నాళ్లుపోతే! 

పనికి ఆహారపథకాయైనమః, 
అమ్మవొడి ప్రదాతాయైనమః... అనుకుంటూ!’

‘అఘోరించావులే! కాస్త చూసి నడుపు. ఎదురుగా ఎవడో ఒంటికన్ను రాక్షసుడొస్తున్నాడు. అదేదో ట్రాక్టరనుకుంటా! అంత అస్థిరమైన వాహనం మరోటిలేదు ఈ భూమ్మీద!’ అన్నాడు హెచ్చరికగా.

చీకటిని చెదరగొడుతూ, చెట్లు కప్పుకున్న మంచు దుప్పట్లను కరిగిస్తూ అడుగడుగునా ఎగసిపడుతున్న మంటల మధ్యనుంచి కర్తవ్యాన్ని ఆవాహనం చేసుకున్న మా వాహనం వేగంగా హాస్పిటల్ ముందు ఆగింది.

ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ రెండు బంతిపువ్వుల్నీ భూమ్మీద పడేసి మళ్లీ ‘మాయింటి మంట’కి వెళిపోవాలి. ఇదివరకే చెప్పాను గుర్తుందా మీకు? అదేదో దేశంలోలా మా అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌కు ఎప్పుడూ నేనే ప్రెసిండెంటుని!

అంచేత ఇలాంటి సరదాలు, సంబరాలప్పుడు విధిగా ఉండితీరాలని నా పట్టుదల.

అనుకున్నవిధంగా ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారు! ఒకటి ముద్దబంతిలాను, మరొకటి సందెగొబ్బెమ్మలాను ఉన్నారు. దేని అందం దానిదే! సూర్యోదయానికి ముందే ఇద్దరు సూర్యుళ్ల కాంతి అక్కడంతా!

అయితే నాకెందుకో ఓటీ కుర్రాళ్లు చాలా అసహనంగాను, అన్యమనస్కంగాను ఉన్నట్టనిపించింది. అదే అడిగాను.

‘ఏవఁర్రా, చలా, నిద్రా? ఎక్కడా హుషారు లేదు?’

‘అదేంకాద్సార్, మా వీధిలో మంటేస్తన్నాం సార్! లేటైపోతందనీసి....!’ అన్నాడు సురేష్.

‘ఓహో, మీరూ వేస్తున్నారా భోగిమంట?’

‘అలాగిలాక్కాద్సార్! డీజే పెట్టించార్సార్! ఈళ్లిద్దరూ రాత్రంతా డెక్కులు కడతానే ఉన్నారు!’ చెప్పాడు రాజు.

భోగిమంటకి డీజేనా? అంటే ఏం పాడతారో పాటలు అని ఊహించడం మొదలెట్టాను. డీజేల విషయంలో నాకున్న జీకే ఉపయోగించి 

‘భోగుల్లో భోగుల్లో...
భోభొభొభొభోభో
ఆల్ర్వైట్... భోగుల్లో... భోగుల్లో..
యువార్ లిసనింగ్ట్యూ... డీజే రాజూ....
భోగభాగ్యాలా... బొ..బో..భోగభాగ్యాల భోగుల్లో...’

నా అంతరాత్మగాడు కార్లో నిద్రపోతున్నాడు. అంచేత నన్ను నేనే ఓదార్చుకుని బయటికొచ్చేశాను.


........జగదీశ్ కొచ్చెర్లకోట




0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive