Latest Posts

Content

Sunday, June 26, 2022

మారే తల్లులు

‘మమ్మీ, నావల్లకాదు. పద, మనం వెళిపోదాం!’ అదేపనిగా అరుస్తోంది మీనా. నిండుగర్భిణి. కాసేపట్లో కనేస్తుందేమో అన్నట్లుగా నొప్పులు వచ్చేస్తున్నాయి.

‘చూడు మీనా, నువ్విలా అరవడం వల్ల డెలివరీ ఆలస్యం అవ్వడంతప్ప ఉపయోగం లేదు. మర్యాదగా ఆ పేంట్ విప్పేసి చీర కట్టుకో!’ చుట్టూ చేరిన నర్సులు ఎంత చెప్పినా వినట్లేదు ఆ పిల్ల.

జీన్స్ విప్పకుండా డెలివరీ చెయ్యమంటుంది తింగరిది. తింగరితనం తన జీన్స్‌లోనే ఉన్నట్టుంది. ఎందుకంటే తనపక్కనేవున్న వాళ్లమ్మ కూడా ఏమీ వారించట్లేదు. 

ఆవిడకిదంతా అనవసర తద్దినంలా ఉంది. అంచేత ఏం మాటాడట్లేదు. కూతురికి నచ్చజెప్పకపోగా నర్సుల మాట వినమని కూడా అనట్లేదు.

మీనా ఒక ప్రైవేట్ ఛానల్లో యాంకర్‌గా పనిచేస్తోంది. ఉద్యోగంలో చేరిన ఏడాదికే కార్తీక్‌తో పరిచయమైంది. ఇద్దరూ కొన్నాళ్లు చాలా సఖ్యంగా ఉన్న తరవాత ఇకనుంచి ‘సౌఖ్యం’గా ఉందామని నిర్ణయించుకున్నారు. తత్ఫలితమున యామె గర్భవతియైనది. ఆ గర్భస్థ శిశువు శుక్లపక్ష చంద్రునివలె దినదిన ప్రవర్ధమానమై పదవనెల వచ్చుసరికి యామె మా పంచనఁజేరినది. 

కాస్తంత తవ్వకం జరిపి మావాళ్లు అసలు విషయాన్ని తెలిసేసుకున్నారు. కార్తీక్‌గాడితో ఈ అమ్మాయికి బ్రేకప్ అయిపోయిందిట. బ్రేకప్పంటే ఏంటో తెలీని అమాయకపు ప్రాణాలు మావాళ్లవి. ఎంతసేపూ షేరాటోకి ఛేంజ్, షిఫ్ట్ ఎక్స్‌చేంజ్ అంటూ తపనా తాపత్రయాలవల్ల తీరికేలేని బ్రతుకులు. దాంతో తనమీద బాగా జాలీ అదీపడి మొత్తానికి ఆ పిల్లనుంచి ఓ పిల్లాణ్ణి బయటికి లాగారు.

వాడు చాలా ముద్దుగా ఉన్నాడు. 

బేబీ ట్రే నిండుగా, కనులపండుగా... అని మేమంతా పాటలవీ పాడుకుంటూ మురిసిపోయి వాణ్ణి తీసుకెళ్లి మీనా పక్కలో పడుకోబెట్టాం. 
......
......
......
ఒక్క తోపు తోసింది!

కాస్తుంటే కిందపడేవాడే! అదృష్టవశాత్తూ ఒక నర్సుపిల్ల క్యాచ్ పట్టి కాపాడింది. అంత అమానవీయంగా ఎందుకు ప్రవర్తించిందో మాకెవరికీ బోధపడలేదు. ఆనక వాళ్లమ్మని అడిగితే చెప్పింది అసలు విషయం: వాళ్లిద్దరికీ ఆ బేబీ అఖ్ఖర్లేదుట!

దాదాపు మూడుకిలోల గుమ్మడిపండుని చూస్తూ చూస్తూ అలా ఎలా కాదనుకున్నారో మాకంతుబట్టలేదు. 

ఆ కుర్రాడితో పెళ్లీ పేరంటం ఉండబోవన్న బాధలో ఈ కర్ణుణ్ణి వద్దనుకుంటోంది మీనా.

సరే, ఆ మధ్యాహ్నమే డిశ్చార్జ్ అయి తల్లీకూతుళ్లిద్దరూ ఇంటికెళిపోయారు. ఆ చంటాణ్ణి ఏంచెయ్యాలో బోధపడక మా నర్సులు ఓ పాత ఉయ్యాల తీసుకొచ్చి అందులో వేసి వాణ్ణి వెచ్చగా బబ్బోపెట్టారు. మళ్లీ ఏక్షణానైనా తల్లిమనసు తల్లడిల్లి రాకపోతుందా అన్న ఆశతో కాచుకు కూర్చున్నారు. ఏడుపనేదే రానివ్వకుండా వాడికి ఆరారా పాలు తాగిస్తూ అలుపనేదే లేకుండా సాకారు. 

చుట్టూ బోలెడంతమంది కొత్త తల్లులు. పాలకి కొదవా? ఒక రొమ్ము సొంతకొడుక్కిచ్చి మరొకటి వీడికందించిన తల్లులు కూడా ఉన్నారక్కడ! మధురాతిమధురం కదా? 

వండుకున్నమ్మకంటే దండుకున్నమ్మ పనే బావున్నట్టు వాడికి పాలు, మురిపాలు చక్కగా అమిరాయి. అందరి దగ్గరా బానే తాగేవాడు. నర్సులందరూ ఉదయం ఎనిమిదింటికి డ్యూటీకి రాగానే వాడి ఉయ్యాల దగ్గరకొచ్చేసేవారు. కాసేపు వాణ్ణి బుజ్జగించి ఆనక పనిలోపడేవారు. 

ఇంతలో శ్రీకాకుళం నుంచి ఎవరో దంపతులకి ఇక్కడ పనిచేస్తున్న ఒకరితో పరిచయం ఉన్నమీదట వారికి ఈ పిల్లాడి గురించి సమాచారం వెళ్లింది. వారికి ఇక సంతానయోగం లేదని  డాక్టర్లు ఏనాడో చెప్పేశార్ట! 

అసలేంజరిగిందో, ఎలా జరిగిందో మాకైతే తెలీదుగానీ వీడు వారింట కృష్ణుడై వెలిశాడు. ఆ నందుడు ఆనందుడయ్యాడు. ఆ యశోద మనసు కవ్వంతో చిలికిన వెన్నకుండే అయ్యింది. వాళ్లు కాస్త ఉన్నవాళ్లు.

దాంతో వాణ్ణి ఎంతో అపురూపంగా పెంచుకుంటూ ఊరంతా వీధికట్టి విస్తళ్లేసి విందుచేశారు. 

సరిగ్గా నెలరోజుల తరవాత ఉదయం పదిగంటలకు హాస్పిటల్ ముందు ఓ కారాగింది. అందులోంచి ఓ నలుగురైదుగురు దిగి లోపలికొచ్చారు. మీనాకి పుట్టిన కొడుకేడంటూ కనబడ్డ ప్రతివారినీ దబాయించడం మొదలెట్టారు. క్షణక్షణం సినిమాలో శ్రీదేవిని సడన్‌గా వచ్చేసి ఫొటో స్టూడియో కవరడిగినట్టు అర్ధంపర్ధంలేని ఆ దబాయింపుకి మావాళ్లు కంగారుపడ్డారు.

ఎవరుమాత్రం ఏంచెప్తారు? వాడు బావుండేవాడని, బోలెడన్ని పాలు తాగేవాడని, అస్సలు ఏడవనిచ్చేవారమేకాదని, ఉయ్యాల సైతం ఏర్పాటు చేశామని ఆదిభట్లవారిలా కథాగానం చేస్తారేతప్ప ప్రస్తుతం వాడెక్కడున్నాడో ఏవొక్కరూ చెప్పలేకపోయారు. దాంతో వాళ్లకి తిక్కరేగి ఒకతన్ని కొట్టారు. గొడవ పెద్దదైంది. విషయం బయటికొచ్చింది.

ఆ వచ్చినవారు కార్తీక్ మనుషులు. ఓ కండిషన్ మీద మీనాతో పెళ్లికి ఒప్పుకున్నాడని తెలిసింది. ‘ఆ పండంటి గుండుగాణ్ణి తీసుకొస్తే మనం పెళ్లాడదాం!’ అన్నాట్ట! వాణ్ణి హాస్పిటల్లోనే ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలి వచ్చానని చెప్పిందిట! ఏ శాకుంతలములో సాకుతూ ఉండవచ్చునని, ఏ కణ్వుడో చేరదీసే అవకాశమూ ఉందని చెప్పిందిట! ఈ పురాణాలన్నీ నాకొద్దు. నా రక్తం నాక్కావాలంటూ నాటకీయంగా నమ్మబలికాడు. 

మీనాకి చింతకాస్తా తీరిపోయి మళ్లీ కార్తీక్ మీదా, పిల్లాడిమీదా కొత్తగా ప్రేమ చింతచిగురులా చిగురించింది. వెంటనే కార్తీక్ స్నేహితులని చెప్పుకుంటూ ఓ నలుగురు అమర్యాదాపురుషోత్తములు కారేసుకొచ్చేశారు. అదీ కథ!

శ్రీకాకుళం దంపతులతో ఈ డీల్ నడిపినతన్ని కనిపెట్టారు. అతణ్ణి పట్టుకుని ఎముకల్లో సున్నం లేనట్టు, ఎడంచేత్తో తప్ప అన్నం తినలేనట్టు ఇరగ్గొట్టేశారు చచ్చినాళ్లు. ఆనక అంతా కలిసి అదే కార్లో శ్రీకాకుళం వెళ్లి ఆ నందనవనాన్ని చిన్నాభిన్నం చేసేశారు. వారిద్దరి సంతోషాలనీ మళ్లీ పూర్వపు స్థితికి తెచ్చేస్తూ ఆ పిల్లాణ్ణి పట్టుకుపోయారు.

ఆ సాయంత్రం దీపాలవేళ ఆ దంపతులిద్దరూ బయటికొచ్చి చూస్తే మాసిపోయిన ఆకాశాం, లోపలికి రాగానే బోసిపోయిన ఉయ్యాలా కనబడ్డాయి. చంద్రుడు కనబడడేమని కుమిలిపోయాయి ఆ రెండుగుండెలూ! 

కేవలం నెలరోజుల గడువులో ఏ క్షణాన ఏ తల్లిప్రేమలో తనువు సేదతీరుతున్నదీ తెలియని తమకంలో పాలే పరమాన్నంగా పెరుగుతోంది ఆ చిన్నిప్రాణం.

‘మాయల దెయ్యానివే మనసా... తెగిన పతంగానివే’ అంటాడు ఆత్రేయ మనసుని! 

అవకాశాలు, అవసరాలనుబట్టి అనుభూతుల్ని మార్చుకోగల నేర్పు ఎదిగినవారికుంటుందేమోగానీ అలా గువ్వలా అమ్మ ఒడిలో ఒదిగినవారికుండదుగా?

ఈ ప్రేమల నిష్పత్తుల వ్యత్యాసాల గోడు పట్టని ఆ చిట్టిపెదాల మీద చిరునవ్వు చాలదా కసాయిని సైతం సాయిగా మార్చడానికి? 

కార్తీక్‌గాణ్ణి కూడా కరిగించే ఉంటాడు వాడు! 

నా ఈ ప్రయాణంలో మరొక విచిత్రమైన అనుభవమిది. మరొకసారి ఇంకొకటి.




.......జగదీశ్ కొచ్చెర్లకోట

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive