‘సార్, మీరు బయల్దేరేముందు శోభ మేడమ్ ఒకసారి కనబడమన్నారు.’
‘ఎందుకు? ఏదైనా కేసొచ్చిందా?’
‘అనుకుంటా సార్! ఎవరో మార్వాడీస్ ఫామిలీ ఉన్నారు మేడమ్ ఛాంబర్ దగ్గర!’
‘సరే, వస్తాలే! ఇదికాక ఇంకొక కేసుంది. ఒక అరగంటలో ఫ్రీ అవుతానని చెప్పు!'
ఆ నర్సుపిల్ల వెళిపోయింది. ‘సాధారణంగా ఆవిడ చేసే సర్జరీలకి అనెస్తీషియా తనే ఇచ్చేసుకుంటుంది. మన అవసరం ఉండదు. ఎందుకు పిలిచిందబ్బా?’ అనుకుంటూ వెళ్లాను.
తన ఎదురుగా ఒక నార్త్ ఇండియన్ మహిళ కూర్చుని ఉంది. చూడగానే చాలా పాష్ అని అర్ధమవుతోంది. అసలు ఆ హాస్పిటల్‌కి వచ్చే వాళ్లందరూ బాగా డబ్బున్నవాళ్లే ఉంటారు.
శోభ ఎదురుగా కుర్చీలో ఓ నాలుగేళ్ల బుజ్జిగాడు కూర్చుని ఉన్నాడు. వెనకనుంచి చూస్తే వాడు నాకు కనబడట్లేదు.
‘జగ్దీష్, నీడ్ యువర్ హెల్ప్! ఇదొక వెరైటీ కేసు. కాస్త అనెస్తీషియా ఇస్తే తప్ప చెయ్యలేను!’ అంది శోభ.
‘చెప్పండి!' అంటూ ఆ బుజ్జిగాడి వైపు చూశాను. వాడి బుగ్గలే ఒక్కొక్కటి పావుకేజీ ఉంటాయి. చాలా చాలా ముద్దుగా ఉన్నాడు. నిండుగా ఆరోగ్యంతో తొణికిసలాడుతూ మెరుస్తున్నాడు. అయితే ఏదో తేడా ఉంది. ఏమిటది?
వాడు కళ్లు తెరవట్లేదని గమనించాను. అయ్యో! ఏమైంది వీడికి?
‘లైస్ జగ్దీష్! పేలు!’
‘వ్వాట్?’
‘అవును. వింటుంటే ఎవరికైనా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ నిజమే! వీడు టింపనీలో యుకెజి చదువుతున్నాట్ట. వీడి గాళ్‌ఫ్రెండ్ ఒకత్తుంది. ఏదో పేరు. ఎప్పుడూ తన పక్కనే కూర్చుంటాడని చెబుతోంది వాళ్లమ్మ. ఆ పిల్లకి తలనిండా పేలున్నాయిట....!’
‘అదిసరే, వీడికెలా వచ్చాయి? అసలా కళ్లకేమైంది?’
‘కమింగ్! ఆ పేలన్నీ వీడికి ఎక్కేసి కళ్లమీద పట్టేశాయి. కనురెప్పలు మొత్తం పేలతో నిండిపోయాయి. గుడ్లు పెట్టేస్తున్నాయి! నువ్వు కాస్త అనెస్తీషియా ఇస్తే అవన్నీ నేను చాలా మెటిక్యులస్‌గా తీసేస్తాను. ఇట్స్ గోయింగ్ టుబి ఎ లాంగ్ ప్రోసెస్. బీ ప్రిపేర్డ్ జగ్దీష్!’ అంది ముందుగానే హెచ్చరికగా.
నాకింకా మతి స్థిమితపడలేదు. వీణ్ణి చూస్తే ఇప్పుడే బోర్నవిటా డబ్బాలోంచి తీసినట్టున్నాడు. వాళ్లమ్మేమో ఖరీదైన పౌడర్ డబ్బాలా ఉంది. వీళ్లకీ పేల బాధేవిఁటో?
వీడూ, ఆ పేలపిల్లా చాలా జిగిరీ దోస్తులుట. ఎప్పుడు చూసినా అలా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటార్ట. కాసేపటికి అదొచ్చి వీడి ఒళ్లో పడి నిద్రపోయేదిట. వీడేమో జోకొట్టడంట... వింటోంటే చాలా ముచ్చటగా అనిపించింది కానీ ఇప్పుడొచ్చిన సమస్య మాత్రం ఎవరూ ఊహించనిది.
సరే మొత్తానికి వాణ్ణి మొత్తం పరీక్షించి కావలసిన సరంజామా అంతా చెక్ చేసుకున్నాను. ఏడుస్తున్న వాణ్ణి బలవంతంగా అందరం కలిసి పడుకోబెట్టాం. ఆనక నేను మత్తుమందు ఇంజెక్ట్ చేసిన పిమ్మట గాఢనిద్రలోకి వెళిపోయాడు.
శోభ చాలా షార్ప్‌గా ఉన్న ఒక ఫోర్సెప్స్ తీసుకుని లూప్స్ అని పిలిచే మైక్రోస్కోపిక్ లెన్సస్ కళ్లకి పెట్టుకుని ఆ ఈళ్లని ఒకటొకటిగా తియ్యడం మొదలెట్టింది.
వాడు కదిలినప్పుడల్లా నేను మత్తుమందు మళ్లీ కాస్తంత ఇస్తూపోతున్నాను. తనకెంత ఓపికంటే... కొన్ని వందల పేలని ఎంతో ఓపికగా మొత్తం తీసేసింది. ఒక్కటంటే ఒక్కటి కూడా వదలకుండా శుభ్రంగా ఏరిపడేసింది.
నిజానికి ఆ పదునైన సాధనంతో ప్రమాదం ఎక్కువ. కానీ పిల్లాడు కదలకుండా పడుకుని ఉండటంవల్ల అంత ఓర్పుతో సాధించింది.
అంతా అయిన తరవాత కళ్లకి ఆయింట్‌మెంట్ రాసి కట్టుకట్టేసి సాయంత్రం ఇంటికి పంపేశాం.
వారం తరవాత వచ్చాడు వెధవ. ఎంత ముద్దుగా ఉన్నాడంటే.. నా దిష్టే తగులుతుందనిపించింది.
మళ్ళీ ఆ పేలిణి దగ్గరకి పంపొద్దని చెప్పి, ఆ పిల్ల తల్లిదండ్రులకి తీసుకోవలసిన చర్యలను సూచించి పంపించాం.
నా అనుభవంలో ఇటువంటి చిత్రవిచిత్రమైన కేసులు చాలా చూశాను. అందులో ఇది మొదటిది. మరోసారి మరొకటి.
0 comments:
Post a Comment