Latest Posts

Content

Friday, April 7, 2017

చలో ఢిల్లీ

"చలికాలం ఢిల్లీ అంటే మీయిద్దరికీ అదిరిపోతుంది. అసలే విజినారం సోంబాబులాంటి పర్సనాల్టీలా! కష్టం! ఆపై మీయిష్టం!" 

అది పదోసారి మావాడు నన్నూ రాంబాబునీ హెచ్చరించడం. ఈ రాంబాబుగాడికి కంగారెక్కువ! చాలా తెలివైనవాడు. కానీ కొంచెం అణకువతోపాటూ వణుకువ కూడా ఎక్కువ వాడికి!

సలహా ఇచ్చినవాడూ మా క్లాస్‌మేటేగానీ వాడికి కాస్త లోకజ్ఞానం ఎక్కువ. వాడంతకుముందు చాలాసార్లు ఢిల్లీ వెళ్ళానని చెప్పాడు. బాహుబలి ముప్ఫైసార్లు చూసినా ఒకసారి చూసినా అదే స్టోరీ కదా! అంచేత వాడెన్నిసార్లు వెళ్ళాడన్నది మాకనవసరం!

అప్పటికి మన చదువైతే పూర్తయింది కానీ ఇంకా రోపూ టాపూ లేదు 😜 నాన్నగారిచ్చిన డబ్బులు జాగర్తగా ఖర్చుపెట్టుకుంటూ దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఉత్తరానికి బయల్దేరాం. మాకులపోళ్ళ సత్రంలో దిగాం..అదేనండీ ఐ. ఎమ్.ఏ. హాలు! 

అదేంచలో బాబోయ్! అంతకుముందెప్పుడూ చూసెరగం కదా! సాయంత్రఁవయ్యేటప్పటికి మంచమ్మీంచి దిగాలన్నా దిగులొచ్చేసింది. 

"అమ్మా! చూడాలీ! నిన్నూ నాన్నను చూడాలీ!" అని నేనూ, 
"చూడాలని వుందీ! అమ్మా చూడాలనివుందీ!" అని రాంబాబుగాడూ పాడుకోడం మొదలెట్టాం.

ఇంతలో హిందీమాత్రమే తెలిసిన రూమ్‌బోయొకడు మమ్మల్నేడిపిద్దాఁవని బెల్ కొట్టాడు. తలుపు తియ్యగానే "రాత్ కో ఖానా!" అన్నాడు చాలా ఎగ్జయిటింగా! 

మావాడికి దవాఖానా అంటే తెలుసు. అంచేత "హాఁ!" అన్నాడు. 

"ఏఁవిటి హాఁ! వాడేఁవడిగాడో నీకర్ధమైందా?" అన్నాను కోపంగా! 

నేనప్పటికే డిడి న్యూసదీ చూస్తుండేవాణ్ణి కాబట్టి కాస్తంత హిందీ వచ్చు.

"మనం డాక్టర్లఁవేనా అనడుగుతున్నాడు కదా?" అన్నాడు రగ్గుతోపాటు మంచందిగి! 

"చంపావుపో! రాత్రికి భోజనం సంగతడుగుతున్నాడు. ఏంచెప్పనూ?" 

"బయటకయితే నేన్రాను. వాణ్ణే తెమ్మను. నువ్వు చెప్పెయ్!" అన్నాడు రగ్గు తప్పించి.

మావాడి లుంగీ, దానిమీద స్వెట్టరూ చూసి రూమ్‌బోయ్ కి నవ్వొచ్చేసింది. ఆపుకుని మెనూ చెప్పడం మొదలెట్టాడు. 

"దో రోటీ, సబ్జీ, ఆచార్, దహీ, స్ఫీట్, ఔర్ చావల్!" అన్నాడు. వెంటనే మావాడు "వాటెబౌట్ రైస్?" అన్నాడు!

వాడు చావలన్నది వీడికి అర్ధమై చావలా!

వీడు రైసనగానే లుంగీని చూసి ఆపుకున్న నవ్వూ, ఈసారిదీ కలిపి ఒక్కసారిగా నవ్వేసాడు. "హా హా..రైస్ భీ హైనా?" అన్నాడు సంయమనం పాటించి.

"ఒరేయ్ నువ్ కాసేపాగు. నీహిందీ నువ్వూను!" అన్చెప్పి మావాణ్ణి అదుపులోకి తీసుకుని వాడికి ఆర్డరిచ్చి పంపించేసాను. 

ఎయిమ్స్ లో మా సీనియరొకతను కార్డియోథొరాసిక్ పీజీ వుంటే ఆ మర్నాడు అతని దగ్గరకెళ్ళాం. అతను వాళ్ళ పీజీ క్వార్టర్స్‌లో ఖాళీవున్న పోర్షనొకటి మాకిచ్చాడు. 

అందులో వుండమని, సెల్ఫ్‌లాకింగ్ తలుపని, తాళంచెవులు, ఒళ్ళూ దగ్గరెట్టుకోమని మరీమరీ చెప్పిమరీ ఇచ్చాడు.

ఆరోజు ఖాళీ! రూమ్‌లో కూర్చుని తెగ చదివేసాం ఇద్దరం. రాత్రి ఎనిమిదింటికి నేను మంచినీళ్ళు తెద్దాఁవని పక్కనేవున్న వాటర్‌కూలర్(ఆఫ్ చేసే వుందిలెండి!)దగ్గరకి వెళ్ళి మళ్ళీ మావాడిమీద డౌటొచ్చి పరుగెట్టుకుంటూ వచ్చాను. 

కానీ అప్పటికే వాడు బయటికొచ్చేసాడు. తలుపు క్లిక్ మన్న శబ్దం వచ్చింది కానీ నాగుండెమాత్రం క్లిక్కన్న శబ్దంచెయ్యడం ఆపేసింది ఒక్కసారి!

ఇద్దరి దగ్గరా తాళాల్లేవు. లుంగీలు కట్టుక్కూర్చున్నాం. స్వెట్టర్లు కూడా రూమ్‌లో వుండిపోయాయి. అక్కడెవణ్ణి చూసినా కళ్ళు తప్ప ఇంకేఁవీ కనబడకుండా కప్పుకు తిరుగుతున్నారు. 

తెల్లారితే పరీక్ష! ఒకళ్ళనొకళ్ళం బ్లేమ్ చేసేసుకున్న తరవాత కర్తవ్యం గుర్తొచ్చి అందరి రూములకీ బయల్దేరాం. 

పెదవి విరిచినవాళ్ళు కొందరు... 
అంత ఒళ్ళూపై తెలీకండా ఎలావున్నారని తిట్టినవాళ్ళు కొందరు...
'మదరాసీ హైనా!' అని ముసిముసిగా మంకీకేప్ లో నవ్వుని దాచేసుకున్నవాళ్ళు కొందరు!

మొత్తానికి పనయ్యే మార్గం మాత్రం ఎవడూ ఉపదేశించలేదు. అప్పుడు కనబడ్డాడు ఒక తెలుగుబిడ్డ! అదేదో పీజీ చేస్తున్నాడు వాడు. 

"ఏంజరిగింది?" అనడగ్గానే మా సొంతన్నయ్యని చూసినట్టు ఏడుపొచ్చేసింది. అంత తెలుగు మేం తట్టుకోలేకపోయాం! 'వా!' అంటూ వాపోయాం.

"దీనికొకడున్నాడు. వాడిపేరు భూషణ్! మనవాడే, కరీంనగర్(అప్పటికింకా మనవాడేగా!😜)!" అన్నాడు కళ్ళుమూసుకుని పెన్సిల్‌తో నుదుటిమీద కొట్టుకుంటూ!

సడెన్ గా కుర్చీలోంచి లేచి "నాతోరండి!" అంటూ బయల్దేరాడు. వాడు అన్ని వరండాలూ దాటి గబగబా నడుచుకుంటూ మూడు వింగులదాకా మమ్మల్ని తీసుకెళ్ళాడు. 

అన్నాలింకా తినని కారణంగా మాయిద్దరికీ కడుపులో ఎలకలు వాటిలో అవే హండ్రెడ్ మీటర్స్ రేస్ పెట్టుకుని పరుగెడుతున్నాయి. 

ఒకమూల లుంగీల్లోంచి చలిగాలి స్వేచ్ఛగా లోపలికెళిపోయి విశృంఖలంగా వికటాట్టహాసం చేస్తోంది. ఏడుపుకూడా రావట్లేదు మాకు. 

తీరా భూషణంగాడి రూముకెళ్తే వాడి తలుపు మూసేసుంది. కొట్టికొట్టి ఎంతకీ తియ్యకపోతే పక్కవాణ్ణడిగాం. 

"సినేమాకో గయా! పురానా మందిర్!" అన్నాడు. 

ఆతరవాత మాతో వచ్చిన తెలుగబ్బాయీ, ఆ అస్సాంకుర్రాడూ పురానామందిర్లో హారర్ కన్నా 'సీన్లే' ఎక్కువనీ, ఆల్రెడీ రెండుసార్లు చూసేసాననీ రేపు మళ్ళీ వెళుతున్నాననీ చొంగ కార్చుకుంటూ మాటాడుకుంటున్నారు. 

మావాడు అదృష్టవంతుడు. వాడికదేమీ అర్ధంకాకపోడంవల్ల వివేకానందస్వామిలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు.

మళ్ళీ సడెన్ గా మావైపు తిరిగి "ఏంచేద్దాం? వాళ్ళేడు. సినిమాకెళ్ళాట్ట! వచ్చేవరకూ వుంటారా?" అన్నాడు చాలా కూల్ గా! అసలే చలేస్తోంటే వాడంత కూల్ గా వుండడం మాకసలు నచ్చలేదు. 

మేం వచ్చిన దూరం తలుచుకుని భయఁవేసి సరేనని అస్సాంకుర్రాడి రూమ్‌లోనే కూర్చున్నాం. వాడి రూమంతా పూర్ణామార్కెట్లా వుంది. ఎక్కడబడితే అక్కడ అరటిపండు తొక్కలు, కమలాఫలాల పీచు, బ్రెడ్డు ముక్కలు..యాక్! 

చీపురట్టుకుని తుడిచేద్దాఁవనిపించింది. వాడు ఫోరెన్సిక్ మెడిసిన్ చదువుతున్నాడు...కరెక్టే.. కానీ రూమునీ మార్చురీని ఒకేలా భావించడం అనవసరం కదా అనిపించింది.

గంటసేపు ఊపిరిబిగబట్టి కూచున్నాక పురానామందిర్లో దెయ్యంకన్నా భీకరమైన ఆకారంతో భూషణ్ దిగాడు.

"మీరేనా వైజాగ్ నించొచ్చారూ?" అన్నాడు కఠినంగా! అలాక్కనక మనవాళ్ళు బ్రిటీషువాళ్ళనడిగి వుంటే రెండొందలేళ్ళు మనకి బానిసత్వం తప్పుండేది. అంత ఘోరమైన తప్పు మేఁవేంచేసామో అని భయపడిపోయాం!

"రండి!" అన్నాడు వీడుకూడా! మళ్ళీ అంత ప్రయాణమూ చేసాం. దార్లో ఒకదగ్గరకి రాగానే పైన వెంటిలేటర్ మీదకి ఒక్కసారిగా ఎగిరి 'సర్ర్....' మంటూ ఏదో లాగాడు. మేం భయపడిపోయాం. మమ్మల్ని చంపెయ్యడానికి కత్తేఁవన్నా తీసాడేమోనని!

తీరాచూస్తే అదొక పాత ఎక్స్‌రే! అదెందుకు తీసాడో మాకర్ధంకాలేదు.

మారూముకి వచ్చేవరకూ ఏఁవీ మాటాడలేదు భూషణం. గొప్పవాళ్ళంతే! మాకతనప్పుడు సుప్రభాత సేవకి గర్భగుడి తెరవబోయే అయ్యవారికన్నా గొప్పగా కనిపించాడు.

ఆ ఎక్స్‌రే తీసికెళ్ళి తలుపుకీ గుమ్మానికీ మధ్య సందులో సరిగ్గా తాళందగ్గర దూర్చి నాబ్ పట్టుకుని ఒక్కసారి తిప్పాడు.

తలుపు తీసి "పొండి లోపలికి! జాగర్తర్రా బాబూ! ఇంతమాయకంగా వుంటే కష్టం!" అంటూ వెళిపోయాడు. మేఁవిద్దరం 'అద్భుతం జరిగినపుడు గుర్తించలేదు. ఆ తరవాత గుర్తించినా ప్రయోజనఁవూ లేదు!' అన్న త్రివిక్రముని మాటకి జీవితకాలపు ఉదాహరణగా మిగిలిపోయాం!

ఆ తరవాత ఆ టెక్నిక్ వాడి శాంట్రో కారొకసారి, రెండు అపార్ట్‌మెంట్లు, బీరువా..చాలా తెరిచేసాను. కంగారుపడకండి..అన్నీ అఫిషియల్ గానే!😜

కార్లో ఎప్పుడైనా లాంగ్ వెళ్ళేటప్పుడు ఏఁవున్నా లేకపోయినా డిక్కీలో ఎక్స్‌రే మాత్రం పెట్టుకెళ్ళేవాళ్ళం!

అదండీ కథ! వారాంతంలో మీకు కాస్తంత వినోదం అందిద్దామని చిన్ని ప్రయత్నం!

శుభరాత్రి!

                                ..........జగదీష్ కొచ్చెర్లకోట 

1 comments:

  1. బ్రిటిష్ వాణ్ణి అడగడం, పూర్ణా మార్కెట్, త్రివిక్రముడి మాట..... U r a killer

    ReplyDelete

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive