"మంటంటే ఇదేం మంటరా? కొత్తవీధి మొదట్లో వేస్తారు...భోగిరోజు తెల్లారే అంటిస్తే ముక్కనుమదాకా కాల్తూనేవుంటుంది. మన్ని రానివ్వరుగానీ అవేం చెట్లురా బాబూ! ఎక్కణ్ణించి కొట్టుకొస్తారో?" తెరిచిన నోరు అలానేవుంచి చెబుతున్నాడు రాజు.
"టైలరప్పారావు ఇవాళదాకా బట్టలివ్వేలేదు. తీరా నిక్కరేసుకు చూస్తే వదులైపోయింది. అమ్మ తిట్టి మళ్ళీ టైట్ చెయ్యమని ఇచ్చింది. ఎలారా ఇలాఅయితే?" సుబ్రమణ్యం ఆవేదన వెళ్ళగక్కాడు.
"సూపర్వైజరుగారబ్బాయికి నాలుగు జతలు కుట్టించార్ట! కనుమకీ, ముక్కనుమకీ కూడా వేసుకోవచ్చు!" కార్పెంటర్ ఆచారి కొడుకు సత్తిపండుకి కొరుకుడు పడని విషయమది!
"తెల్లారే చల్లో ముగ్గెలా వేస్తార్రా? నిన్న పొట్టుపొయ్యి వెలిగిస్తోంటే చూశాను..రవణమ్మా, శారదా గబగబా పెట్టుకుంటూ పోతున్నారు. ఎంత పెద్దముగ్గనీ?!" ద్విభాష్యంవాళ్ళబ్బాయి రహస్యం చెబుతున్నట్టు మొహంపెట్టాడు.
"పదమూడుచుక్కల ముగ్గు రాదుట సూరివారి కోడలికి!" అత్యంత ఆశ్చర్యకరమైన విషయం మాఅమ్మకి!
ధనుర్మాసం నెల్రోజులూ తెల్లవారు ఝామున మొదలయ్యే జనజీవితం పండగల్లో కలిసిపోయేది. బ్రతుకే ఒక పండగలా వుండేది.
కుంకుడుకాయలు, కాగుబిందెల్లో నీళ్ళు
వీధిచివర మంటలు, వంటింట్లో వంటలు
పోగుచేసిన పిడకలదండలు
గుమ్మాలకి మావిడిమండలు
గడపలనిండా పూసిన పసుపులు
కడుపులనిండా మేసిన పశువులు
ముణగదీసి కప్పుకున్న గొంగళ్ళు
మిరియాల ఘాటుతో పొంగళ్ళు
అమ్మాయిల తల్లోకంటే గొబ్బెమ్మల్లోనే అందంగావుండే బంతిపూలు!😜
వినువీధిని అలంకరించే పతంగులు
వీధివీధీ రంగవల్లులతో ఆడంగులు
అంత ఆరాటం ఇప్పుడెందుకు లేదు?
అంత చలి ఇప్పుడెందుకెయ్యడంలేదు??
స్వగృహంలో చేసుకునే వంటలుకాస్తా
స్వగృహానించి తెచ్చేసుకుంటున్నాం!
పట్టుదలగా వేసే భోగిమంటల్ని
ఓ పట్టు కర్రల్తో కానిచ్చేస్తున్నాం!
మాయింటికి రండనే రోజులుపోయి
మాటీవీ చూసుకునే రోజులొచ్చాయి
సంక్రాంతంటే కులమతాలకతీతం
సంబరాలతో అంబరాన సంతకం
మూడురోజులూ మూడాటలూ చూసేవాళ్ళు
మూడుపూటలూ పేకాటలోనే గడిపేసేవాళ్ళు
ముచ్చటగా అలంకరించిన సందె గొబ్బిళ్ళు
ముద్దబంతులతో మెరిసే తెలుగు లోగిళ్ళు
సంక్రాంతంటే....
పరవశించి ప్రకృతికాంతకి మనంచేసే సీమంతం
పశుపక్ష్యాదుల్ని గౌరవించే విశిష్ట సంప్రదాయం
పండించింది పదిమందికీి పంచిచ్చే దాతృత్వం
వీలైనంతలో వినోదం పొందండి
చేతనైనంత సహాయంచెయ్యండి
శుభాకాంక్షలు!
............జగదీష్ కొచ్చెర్లకోట
0 comments:
Post a Comment