Latest Posts

Content

Thursday, May 11, 2017

అబ్దుల్ కలాం

రోజూలాగే తెల్లారింది. ఆరింటికల్లా ఈనాడు, ఏడింటికల్లా పాలవాడు...అంతా అలానే వుంది. 

కానీ ఆ కిటికీలోంచి పడుతున్న కిరణాలలో మంచితనపు వెలుగు తగ్గింది. గుండెలనిండా పీల్చుకున్న గాలిలో మానవత్వపు పరిమళం లేదనిపించింది. 

దినపత్రిక తీస్తే.... 

మీసందేశాల ప్రతిధ్వనులతో అలరారే విశ్వవిద్యాలయాలలో కులాన్ని ఒళ్ళంతా పూసుకున్న అ'ఘోరాలు' చేస్తున్న నేరాలు, 

మానవతకూ రాక్షసత్వానికీ మధ్య 'సరిహద్దు'నతిక్రమించి మతాన్ని మారణాయుధంగా మార్చుకున్న 'లష్కర'మూకల ఘోరాలు.... 

వీటన్నిటిమధ్య 'తగ్గిన బంగారం ధర'.....! 
ఇవీ వార్తలు! 

బంగారంలాంటి మనిషే పోయాడు. భరతమాత కిరీటంలోంచి 'రత్నం' రాలిపడిపోయింది. ఎవడెలాపోతే మీకేం? అసలు మీరెందుకు విద్యార్థుల్ని కదపాలి? ఎందుకు తట్టిలేపాలి, ఉత్తేజపరచాలి? విజ్ఞాన ఖనుల్ని చెయ్యాలి? మునుపెన్నడూ ఏ రాష్ట్రపతీ చెయ్యలేదే? 

'విజయం సాధించడం ఎలా?' అని చెప్పేవాళ్ళేగానీ అపజయాల చరిత్రని అధ్యయనం చెయ్యమనే అధ్యాపకులెంతమంది?

అణువణువునా ప్రపంచశాంతిని కోరుకున్న అణుశాస్త్రవేత్త మీరు. మీరు పుట్టినగడ్డపై పుట్టినందుకు పులకిస్తుంది మా హృదయం. 

ఇక మీసందేశంలేని దేశంలో బ్రతకాలి. మీ ఆలోచనల లోచనాలులేక అంధుల్లా గడపాలి. 

ఈసారి రామేశ్వరం వెళ్ళినపుడు ఆకాశలింగానికే కాదు...ఆకాశమంత కీర్తినిగన్న మీకూ మొక్కాలి. 

మేం న్యూరాలజీ చదువుకున్నరోజుల్లో 'నడక' ఎన్ని రకాలో చెప్పే గురువులందరిలోకీ తను నడిచి చూపించి బోధించిన ఒకానొక అధ్యాపకుడంటే అమితమైన గౌరవం మాకు. 

మీరు మాకు 'నడత' గురించి బోధించలేదు...నడిచి చూపించారు. బొటనవేలడగని ద్రోణులు మీరు.

మీరు వినిపించిన 'రెక్కల' చప్పుడు, మీరు రగిల్చిన ఉత్సాహపు 'అగ్ని' ఈయువతరాన్ని 'అణు'మాత్రమైనా మార్చగలిగితే మీరు కన్న 'కలలు సాకార'మైనట్టే! 

స్వర్గంలోకూడా మీరిలాగే నవ్వుతూ వుండాలి. అందానికి బానిసయిన ఆ ఇంద్రుడు మీ మనస్సౌందర్యాన్ని చూసి మీకు 'స్వర్గరత్న' బిరుదునివ్వాలి. ఇది యావద్భారతావని తరఫున నేను సగర్వంగా కోరుకుంటున్నాను. 

ప్రతీ మనిషికీ అమ్మని చూడాలనిపిస్తుంది. ప్రతి చిన్నారికీ చందమామను తాకాలనిపిస్తుంది...

అలాగే నాకూ అబ్దుల్ కలాంని కలవాలనిపించేది. కానీ నేను ఏకలవ్యుడిగానే మిగిలిపోయాను.......!
                        
                         ...........కొచ్చెర్లకోట జగదీష్ 

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive